ఏపీలో జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరాటం వన్ సైడ్ గా ముగిసే అవకాశం ఉంది. ఇఫ్పటికే పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి చేసిన నిమ్మగడ్డ ముచ్చటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా పూర్తి చేసి పోతారని అందరూ భావించారు. ఎందుకంటే నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి చేసి వెళ్తారని అంతా భావించారు. గతంలో రాజ్యాంగంలోని 243కె అధికరణ కింద ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉందని, ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కమిషన్ విధి అని నిమ్మగడ్డ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ ఎన్నికలను నిర్వహించకుండా సెలవుపై వెళ్లిపోతున్నారు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది. విచారణను శనివారం నాటికి వాయిదా వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వివరణ ఇవ్వాలని నిమ్మగడ్డను హైకోర్టు కోరింది. కేవలం 6 రోజుల్లో ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు. వీటిని నిర్వహించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకోవటం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.
నిజానికి గత ఏడాది కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో సంచలనానికి తెరలేపారు. అంతేకాదు నిమ్మగడ్డపై సీఎం జగన్ ఎదురుదాడికి దిగారు. నిమ్మగడ్డను ఒక కులానికి చెందిన వ్యక్తిగా దురుద్దేశాలను ఆపాదిస్తూ విమర్శలు చేశారు. ఒక దశలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను మార్చుతూ కనగరాజ్ ను నియమిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ హై కోర్టులో స్టే విధించడంతో నిమ్మగడ్డనే కొనసాగాల్సి వచ్చింది. నిమ్మగడ్డ, వర్సెస్ జగన్ అన్నట్లుగానే ఏడాదంతా గడిచి పోయింది. అయితే నిమ్మగడ్డ పదవీ కాలంలో మార్చి నెలాఖరుకు పూర్తి కానుంది. అయితే మధ్యలో ఎస్ఈసీ నిమ్మగడ్డ సీఎం జగన్ తో కాంప్రమైజ్ అయ్యారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపించడం గమనార్హం. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా పేర్కొనడం విశేషం. ఇదిలా ఉంటే ఎస్ఈసీ ఇప్పటికే పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికలను పూర్తి చేశారు. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం నిర్వహించలేనని చేతులు ఎత్తేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికార పార్టీకి చెందిన నేతలు కోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఏం తేలనుందో తెలియాల్సి ఉంది.
నిజానికి గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు భారీగా ఏకగ్రీవం అయ్యాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి ఎవరైనా బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాల కారణంగా నామినేషన్ వేయలేకపోయారో వారు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరిపుతామని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు సమగ్ర విచారణ జరిపి ఇప్పటికే తుది తీర్పు నిచ్చింది. ఈ తీర్పులో ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని పేర్కొంది. గతంలో ఏకగ్రీవమైన వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో, అక్కడ మళ్లీ ఎన్నికలు జరుపుకోవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా కోర్టులో చుక్కెదురు కావడంతోనే నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకోవాలి చూస్తున్నారని, అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ మార్చి నెలాఖరు తర్వాత నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తి కానుంది. ఈ లోగా ఈ కథ ఎంత ముందుకు సాగుతుందో తేలాల్సి ఉంది.